kadapa places
నందలూరులో చూడవలసిన ప్రదేశాలు
నందలూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో వున్న
ప్రముఖ పట్టణము. ఇది కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో వుంటుంది. కడప నుండి 42 km మరియు
రాజంపేట నుండి 10 km దూరంలో ఈ నందలూరు పట్టణం
వుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది మరియు అతి
పురాతనమైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం మరియు అనేక రహస్య గుహలు ఇక్కడ వున్నాయి.
ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
నందలూరులో చూడవలసిన ప్రదేశాలు :
- బౌద్ధారామం
- పురాతన గుహ
- శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం
- చెయ్యేరు బ్రిడ్జ్ మొదలైనవి
బౌద్ధారామం :
నందలూరుకు సమీపంలోని ఆడపూరు వద్ద పురావస్తు శాఖ వారి తవ్వకాలలో అతి పురాతనమైన బౌద్ధ స్థూపాలు, బౌద్ధ విహారాలు, మరి కొన్ని పురాతన కట్టడాలు, ఇంకా కొన్ని బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. నందలూరు నుండి అడపూర్ వెళ్ళే మార్గంలో వున్న గుట్ట పైన ఈ స్థూపాలు వున్నాయి. ఈ గుట్టను “బైరాగి గుట్ట” అని పిలుస్తారు. క్రీ. పూ 3 - 11 వ శతాబ్ధం మధ్య కాలంలో నందులూరు లోని “బహుదా నది” ఒడ్డున బౌద్ధారామాలు విరాజిల్లాయని, దక్షిణ భారతదేశ పర్యటన చేసిన చైనా యాత్రికుడు “హుయాన్ త్సాంగ్” ప్రపంచానికి తెలియజేశారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నందులూరు బౌద్ధ ఆరామాల్లో దాదాపుగా 15 స్థూపాలు వున్నట్లు చరిత్రకారులు గుర్తించారు. బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూ సంఘారామాలలో నివసిస్తూ ధర్మ ప్రచారం సాగిస్తూ, ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్థూపాలను, చైత్యాలను నిర్మించుకొన్నారు. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను “విహారాలు” అని పిలుస్తారు. ఒకే చోట స్థూపాలు, విహారాలు, చైత్యాలు, విద్యాలయాలు కలిగి వుంటే ఆ ప్రాంతాలను “ఆరామాలు” అంటారు. అందువల్లనే ప్రస్తుతం నందలూరులో వున్న ఈ ప్రాంతాన్ని “బౌద్ధారామం” అని పిలుస్తున్నారు.మరింత సమాచారం :
బుద్ధుని నిర్వాణం తరువాత ఆయన ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత అశోకుడు వాటిలో ఏడింటిని తెరిపించి అందులోని శకళాలను చిన్న ఖండాలుగా చేసి 84000 స్థూపాలను నిర్మించాడని ప్రతీతి.బౌద్ధుల స్థూపాలలో మూడు రకాలున్నాయి అవి :
1. ధాతుగర్భ స్థూపాలు: బుద్ధుడు మరియు ప్రముఖ బౌద్ధసన్యాసుల అవశేషాలపై నిర్మించిన స్థూపాలను “ధాతుగర్భ స్థూపాలు” అని అంటారు.2. పారిభోజిక స్థూపాలు: బౌద్ధమత పవిత్ర గ్రంధాలుగానీ మరియు ఇతర పవిత్ర వస్తువులను ఖననం చేసి వాటి పైన నిర్మించిన స్థూపాలను “పారిభోజిక స్థూపాలు” అని అంటారు.
3. ఉద్ధేశిక స్థూపాలు: ఎలాంటి వస్తువులను ఉంచకుండా కేవలం స్మారక చిహ్నంగా నిర్మించిన వాటిని “ఉద్ధేశిక స్థూపాలు” అని అంటారు.
పురాతన గుహ :
బౌద్ధ స్థూపాలు వున్న బైరాగి గుట్ట కింద ఒక పెద్ద సొరంగ
మార్గం ( గుహ ) వుంది. ఈ పురాతన గుహ క్రీ. శ 11 వ శతాబ్దానికి చెందినదిగా
చరిత్రకారులు గుర్తించారు. ఈ గుహలో నుండి సిద్దవటం కోట వరకు రహస్య సొరంగ మార్గం
వుందట. చోళుల కాలంలో చోళుల మీద “ఇతర రాజ్యాల రాజులు” దండయాత్ర చేసినప్పుడు చోళులకు
మరియు సిద్ధవట రాజులకు మంచి సఖ్యత వుండడం వలన ఇక్కడ వున్న నిధులను ఈ గుహ ద్వారా
తీసుకు వెళ్ళేవారట. నందలూరుకి చెందిన “అలీమియా” అనే ఆయన “అల్లాహ్” మీద నమ్మకంతో ఈ
గుహ ద్వారా వెళ్ళి గుహకు అవతలివైపు వున్న సిద్ధవటం కోట లోని దర్గాను సందర్శించుకొని
మళ్ళీ తిరిగి వచ్చారట. అయితే ఆయన గుహ లోకి వెళ్లేటప్పుడు కేవలం ఒక లాంతరును
మాత్రమే తన వెంట తీసుకు వెళ్లారట. ఆయన తిరిగిరావడానికి దాదాపుగా 43 రోజుల సమయం
పట్టింది. కానీ ఆయన తిరిగి రాక ముందే వారి బంధువులు ఆయన చనిపోయి వుంటాడని భావించి
వారి సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి చేసే 40 రోజుల కార్యక్రమంను కూడా
జరుపుతారు. ఆయన తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత మామూలుగానే కన్నుమూశారు. అయితే
ఆయన చేసిన సాహసానికి ఆయనను ఒక ప్రసిద్ధ చెందిన వ్యక్తిగా భావించి ఆయనకు పూజలు
చేస్తున్నారు. ఈ గుహకు సమీపం లోనే ఆయన యొక్క సమాధిని దర్శించవచ్చు. శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం :
శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం 11 వ శతాబ్దపు పురాతన వైష్ణవ
ఆలయం. 11 వ శతాబ్ధంలో చోళవశం యొక్క రాజు “కుళోత్తుంగ చోళుడు” ఈ ఆలయ నిర్మాణం
చేసినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ నిర్మాణం చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17 వ శతాబ్ధం వరకు కొనసాగింది. ఈ ఆలయంలోని స్వామి వారు
సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా
ప్రసిద్ధికెక్కారు. ఈ ఆలయం చుట్టు 9 ప్రదక్షిణలు చేసి కోర్కెలను మొక్కుకొని, తరువాత 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ చరిత్ర :
ఇతిహాసం ప్రకారం ఒక సారి “మహావిష్ణువు” నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు అనగా బాహుదా నది పరిసర ప్రాంతాలకు వచ్చి అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడు అయ్యారట. ఆ తారువత నారద మహర్షి కోరిక మేరకు స్వామి వారు బహుదానది తీరంలో “శ్రీ సౌమ్యనాథ స్వామి” పేరుతో వెలిశారని స్థలపురాణాలు చెబుతున్నాయి.ఆలయ విశేషాలు :
క్రీ.శ 12వ శతాబ్ధంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలి గోపురాన్ని మరియు ఆలయం చుట్టు ప్రహారీ గోడను నిర్మించారు. రాజ గోపురం దాటి ఆలయం లోపలికి వెళ్తే ఒక శిలా దీపస్తంభం, దానికి ముందు ధ్వజ స్తంభం, బలిపీఠం, గరుడ మండపాలు మరియు ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు, బయట మరోక పెద్ద కోనేరు వున్నాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వుంటుంది. గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా స్వామి వారు ఉదయం నుండి సాయత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరగడం ఒక అధ్బుతం. సంవత్సరంలో ఒక రోజు సూర్యోదయంలో తొలి కిరణాలు స్వామి వారి పాదలపై ప్రసరించే విధంగా శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆలయం లోపలి గోడల మీద ఒక చేప ఆకారం వుంటుంది ఈ చేపకు కూడా ఒక ప్రత్యేకత వుంది, అదేమిటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ చేప ఎప్పుడైతే నీటిలో మునిగి ఈత కొడుతుందో అప్పుడు కలియుగాంతం సంభవిస్తుందట.ప్రతి యేట ఆషాడ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించడానికి ఈ జిల్లా నుండేకాక తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు.
చెయ్యేరు వంతెన ( బ్రిడ్జ్ ) :
చెయ్యేరు నది మీద నిర్మించిన ఈ వంతెన ఇక్కడి ప్రజలకు ఒక
అందమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ వంతెన వద్ద మనం అందమైన సూర్యోదయాన్ని
వీక్షించవచ్చు. నదిలోని నీరు కొంచెం తక్కువగా వున్నప్పుడు ఈ ప్రాంతం ఒక చిన్న
పిక్నిక్ ప్రదేశంగా వుంటుంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా సాయంకాల సమయంలో మరియు
వీకెండ్స్ లలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వంతెన సమీపంలోనే మనం శ్రీ
షిర్డి సాయి బాబా ఆలయాన్ని కూడా దర్శించవచ్చు. ఇతర ప్రదేశాలు :
ఈ నందలూరులో ఇంకా చాలా చూడవలసిన ప్రదేశాలు వున్నాయి. అవి కన్యక చెరువు, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, శ్రీ అంకాలమ్మ దేవాలయం, శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి ఆలయం. ముతిమారమ్మ ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ షిర్డి సాయి బాబా ఆలయం, శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయం ఈ ఆలయం కన్యకా చెరువు గట్టున వెలిసింది. ఇంకా చాలా మసీదులు మొదలైన ప్రదేశాలు ఇక్కడ వున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్ళపాక గ్రామం కూడా ఈ నందలూరు పట్టణానికి 4 km దూరంలో వుంది.ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : ఈ నందలూరు కడప నుండి 42 km మరియు రాజంపేట నుండి 10 km దూరంలో వుంది. కడప మరియు రాజంపేట మధ్య RTC బస్సు సౌకర్యం వుంది. రైలు మార్గం : నందలూరుకు దగ్గరలోని రైల్వే స్టేషన్ వచ్చేసి కడప 42 km మరియు నందలూరులో కూడా రైలు సౌకర్యం వుంది.
విమానాశ్రయాలు : ఇక్కడికి దగ్గరలో వున్న విమానాశ్రయాలు కడప, తిరుపతి మరియు హైదరాబాద్. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలిసి వుంటే కింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు