chittoor places
తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు
తిరుమల ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వున్న తిరుపతి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
ఈ తిరుమల కొండలపై కలియుగ దైవం అయిన “శ్రీ వేంకటేశ్వర స్వామి” వారి ఆలయం వుంది.
తిరుమల “శ్రీ వేంకటేశ్వర స్వామి” వారి ఆలయాన్ని ప్రతిరోజూ లక్ష
నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక రోజులలో అయితే 5 లక్షల మంది
వరకు దర్శనం చేసుకుంటారు.
తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు :
- కాలినడక మార్గం
- పాపవినసనం
- ఆకాశగంగ
- జాపాలి తీర్థం
- శ్రీవారి ఆలయం
- శ్రీవారి పాదాలు
- శిలాతోరణం
- చక్రతీర్థం
కాలినడక మార్గం :
తిరుమలకు వెళ్ళటానికి ప్రస్తుతం రెండు మెట్ల మార్గాలు వున్నాయి. అవి శ్రీ వారి మెట్టు మార్గం మరియు అలిపిరి మెట్ల మార్గం.శ్రీ వారి మెట్టు మార్గం :
శ్రీ వారి మెట్టు మార్గం చంద్రగిరి వద్ద నుండి మొదలవుతుంది. ఈ మెట్ల మార్గంలో దాదాపుగా 2500 మెట్లు వుంటాయి. ఇది కేవలం 6km దూరమే వున్నప్పటికి అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది, కాబట్టి దీన్ని కేవలం స్థానికులు మరియు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు.అలిపిరి మెట్ల మార్గం :
ఇక్కడి రెండు మెట్ల మార్గాలలో అలిపిరి మెట్ల మార్గము చాలా ప్రాచుర్యమైనది. ఇది అలిపిరి నుండి మొదలవుతుంది.ఈ అలిపిరి తిరుపతి నుండి 5km దూరంలో వుంది. ఈ అలిపిరి మెట్ల మార్గంలో దాదాపుగా 3550 మెట్లు వుంటాయి. ఈ మెట్ల మార్గం దాదాపుగా 11km పొడవు ఉంటుంది. ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, అందమైన ఉద్యానవనాలు భక్తుల కోసం అనేక సదుపాయాలున్నాయి. ఈ అలిపిరి మెట్ల మార్గం వెంబడి చాలా ప్రదేశాలను చూడవచ్చు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అలిపిరి మెట్ల మార్గంలో చూడవలసిన ప్రదేశాలు :
పాదాల మండపం :
అలిపిరి మెట్ల మార్గంలో మొదటగా పాదాల మండపం కనిపిస్తుంది. ఇక్కడి నుండే తిరుమల కొండపైకి మెట్లు మొదలవుతాయి. ఇక్కడ “శ్రీ వారి పాద మండపం” అని ఒక ఆలయం వుంది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను భక్తులు వారి తల మీద పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కూడా వుంది. మరియు మొదటి గోపురం వుంటుంది.గాలి గోపురం :
2000 మెట్లు ఎక్కిన తరువాత అందమైన ఈ కొండ కొన భాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్ దీపాలతో తిరునామం ఆకారం దర్శనమిస్తుంది. ఈ తిరునామం ఆకారం రాత్రి సమయంలో చాలా దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారంగా చెప్పుకోవచ్చు. అలిపిరి నుండి గాలి గోపురం వరకు వున్న మెట్ల మార్గాన్ని “మట్లి అనంతరాజు” నిర్మించారని భావిస్తారు. ఈ గాలి గోపురం వద్దనే దివ్య దర్శన టికెట్లు ఇస్తారు.
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం :
ఇక్కడ 30 అడుగుల “శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి” వారి విగ్రహం ఉంది. ఈ స్వామికి రోజు అర్చన నివేదనలు జరుగుతాయి. హనుమజ్ఞయంతి రోజున ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ TTD వారు అభివృద్ది చేసిన ఉద్యానవనాలు వున్నాయి. ఇక్కడే శేషాచాల వనదర్శిని అనే ఒక అటవీ మ్యూజియం కూడా వుంది.ఇతర ప్రదేశాలు :
ఈ అలిపిరి మెట్ల మార్గంలో అక్కడక్కడ సేద తీరడానికి వసతులు, ఆహ్లాదం కొరకు జంతుప్రదర్శనశాలలు (జింకల పార్కు) వున్నాయి. ఇంకా ఈ మెట్లమార్గంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం, మోకాళ్ళ పర్వతం మొదలైనవి ఉన్నాయి. ఈ దారి అక్కడక్కడ బస్సులు వెళ్ళే రోడ్డుపైన కూడా కొనసాగుతుంది. ఈ మెట్ల దారిపై ఎండకు, వానకు రక్షణగా పైకప్పు వేశారు. ఈ మెట్ల మార్గం చాలా దూరం ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ మెట్ల దారి ద్వారానే భక్తులు వెళుతుంటారు. మొక్కుబడి వున్నవారు ఎక్కువగా ఈ దారిలో వెళ్తుంటారు. ఇలా మెట్ల దారి ద్వారా కాలినడకన వచ్చే వారికి శ్రీ వారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయి.పాపవినాశనం :
తిరుమలలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు వున్నాయి అందులో ఒకటి మరియు ముఖ్యమైనది పాపవినాశనం. ఇది తిరుమల శ్రీ వారి ఆలయం నుండి 5km దూరంలో వుంది. పాపవినాశనం తీర్థం పరమపావనమైనది మరియు తిరుమలలోని ప్రసిద్ధ పుణ్యతీర్థాలలో ఒకటిగా వెలసింది. ఈ తీర్థంలో స్నానమాచరించిన సకల పాపములు నశించి సకల కోరికలు మరియు సుఖ శాంతి ప్రాప్తించును. అందువల్ల ఈ తీర్థానికి పాపవినాశనం అనే పేరు ఏర్పడింది అని పురాణములలో పేర్కొనబడింది. ఇచ్చట శ్రీ గంగా భవాని మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారు నెలకొని వున్నారు. పాపవినాశనం జలపాతం దగ్గర ఒక ఆనకట్టను నిర్మించారు, జలపాతం నుండి ప్రవహించే నీరు ఈ ఆనకట్టలో నిల్వచేయబడుతుంది మరియు తిరుమలలోని నీటి అవసరాలకు కూడా ఈ నీరు ఉపయోగించబడుతుంది.వర్షాకాలం ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ సీజన్లో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా వుంటుంది. పాపవినాశనం చేరుకోవడానికి మనకు APSRTC బస్సు సౌకర్యం ఉంది. అవి ప్రతి 20 నిమిషాలకు ఉదయం 5 గంటల నుండి అందుబాటులో వుంటాయి అంతేకాకుండా మీరు ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా ఇక్కడ వున్న ప్రదేశాలకు వెళ్ళవచ్చు. పాపవినాశనం వెళ్ళే మార్గంలో వున్న ఇతర ప్రదేశాలు ఆకాశగంగ, జాపాలి, వేణుగోపాల స్వామి ఆలయంలను కూడా సందర్శించవచ్చు.
ఆకాశగంగ తీర్థం :
తిరుమల కొండల్లో గల ఆకాశగంగ తీర్థము పరమ పవిత్రమైనది. ఇది శ్రీ వారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 km దూరంలో వుంది. ఈ ఆకాశగంగ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికీ తెలియని ఒక అంతుచిక్కని రహస్యం. ప్రకృతి సహజ సిద్దంగా ప్రవహించే ఈ తీర్థానికి వివిధ రకాల కథలు వున్నాయి ఆకాశగంగ ప్రదేశంలో ఒక పుష్కరం పాటు అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుని గర్భాన ధరించిందని ప్రతీతి. ఇక్కడ ప్రతి నిత్యం స్వామి వారి అభిషేకానికి 3 రజిత పాత్రల నిండా ఆకాశ గంగ తీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు తీసుకు రావడం సంప్రదాయం.జాపాలి తీర్థం :
జపాలి తీర్థం తిరుమలలోని ఒక హనుమాన్ ఆలయం. తిరుమల సందర్శనలో చాలా తక్కువ మందికి తెలిసిన మరియు విలువైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇది గోగర్భం ఆనకట్ట నుండి 3km, శ్రీ వారి ఆలయం నుండి 7km దూరంలో వుంది. తిరుమల నుండి ఆకాశగంగ తీర్థంనకు వెళ్ళే మార్గంలో ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ దట్టమైన అడవిలోకి 1km ట్రెక్కింగ్ చేసిన తరువాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం ఒక చిరస్మరణీయమైన అనుభవం. ఈ ఆలయ ప్రాంగణంలో “రామ్ కుండ్” మరియు “సీతమ్మ కుండ్” అనే చెరువులు వున్నాయి. ఈ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద గణేషుడి రూపంలో ఒక చెట్టును చూడవచ్చు.శ్రీ వారి ఆలయం :
తిరుమల ఆలయాన్ని “తొండమాన్” చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఈ తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దాసులే. విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయం యొక్క విస్తరణ జరిగినది. సతీసమేతుడైన శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహాలు ఈ ఆలయ ప్రాంగణంలో వున్నాయి. ఈ ఆలయం సమీపంలో స్వామి వారి పుష్కరిణి, వరాహ స్వామి ఆలయం, అన్నదాన సత్రం, ఆలయం వెనుక భాగంలో ఒక పెద్ద మ్యూజియం, మ్యూజికల్ ఫౌంటెన్ మరియు లడ్డు కౌంటర్ మొదలైన ప్రదేశాలు వున్నాయి.శ్రీ వారి పాదాలు :
తిరుమలలో సందర్శించవలసిన ప్రదేశాలలో మరొక ముఖ్యమైన ప్రదేశం శ్రీ వారి పాదాలు. ఈ ప్రదేశం శ్రీ వారి ఆలయం నుండి 5 km దూరంలో వుంది. ఈ ప్రదేశం ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి ప్రైవేట్ టాక్సీలు అందుబాటులో వున్నాయి. వేదాలు మరియు పురాణాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు మొదట ఏడు కొండలలో ఒకటైన నారాయణగిరి అనే ఈ కొండ పైన అడుగు పెట్టారట. మనం ఈ ప్రదేశంతో పాటు శిలాతోరణం, చక్రతీర్థం అనే ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.శిలాతోరణం :
ఈ ప్రదేశం శ్రీ వారి ఆలయం నుండి ఉత్తర వైపున 1km దూరంలో వుంది. ఈ శిలాతొరణం సహజ సిద్దంగా ఏర్పడింది మరియు దీని ఎత్తు 3m మరియు 8m వెడల్పు కలిగి వుంటుంది. శిలాతోరణం సమీపంలో మనం చక్రతీర్థంను కూడా సందర్శించవచ్చు. ఇంకా ఈ తిరుమలలో చాలా చూడవలసిన ప్రదేశాలు వున్నాయి వాటి గురించి వీలైతే ఇంకొక ఆర్టికల్లో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : తిరుమలకు ప్రసిద్ద నగరాల నుండి నేరుగా బస్సు సౌకర్యం వుంది.రైల్వే మార్గం : తిరుమలకు దేశంలోని ప్రసిద్ధ నగరాల నుండి నేరుగా రైళ్లు అందుబాటులో వున్నాయి.
విమానాశ్రయం : దూర ప్రాంతాల నుండి తిరుమల చేరుకోవడానికి, తిరుపతి నగరానికి సమీపంలో వున్న ఏర్పేడులో మనకు విమానాశ్రయం అందుబాటులో వుంది. ఇంకా మీకు ఏమైన సమాచారం కావలసివుంటే కింద కామెంట్ చేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు