యాగంటి క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు
యాగంటి
క్షేత్రం కర్నూలు జిల్లాలోని బనగానపల్లి గ్రామానికి సమీపంలో వున్న పుణ్యక్షేత్రం.
ఇక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం, సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు
మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఈ యాగంటి క్షేత్రంలో “శ్రీ ఉమామహేశ్వర స్వామి”
స్వామి వారు నెలకొని వున్నారు. అదేవిధంగా ఈ ఆలయం సమీపంలోని ఒక కొండ గుహలో “శ్రీ
వేంకటేశ్వర స్వామి” వారు కూడా నెలకొని వున్నారు. ఈ యాగంటి క్షేత్రంలో ఒక పెద్ద
నంది విగ్రహం వుంది, దానిని “యాగంటి బసవన్న” లేదా
“యాగంటి బసవయ్య” అని పిలుస్తారు. ఈ “యాగంటి బసవన్న అంతకంతకూ పెరుగుతూ, కలియుగాంతం నాటికి లేచి రంకె వేయును” అని “శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర
స్వామి” వారు తన కాలజ్ఞానంలో వర్ణించారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో కాకులు కూడా
ఉండవని ప్రతీతి. ఇంతటి గొప్ప విశేషాలు వున్న యాగంటి క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల
గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.
యాగంటి క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు :
- యాగంటి
బసవన్న
- యాగంటి
గుహలు
- అగస్త్య
పుష్కరిణి
యాగంటి బసవన్న :
ఈ యాగంటి
క్షేత్రంలో ప్రధాన ఆలయముఖమండపము నందు ఒక పెద్ద నంది విగ్రహం వుంది, దానిని
“యాగంటి బసవన్న” లేదా “యాగంటి బసవయ్య” అని పిలుస్తారు. ఈ నందీశ్వరుడు ఈ
క్షేత్రంనకు ఒక ప్రత్యేక ఆకర్షణ. సుమారు 70 ఏళ్ల
క్రితం ఈ నందీశ్వరుని చుట్టు ప్రదక్షిణలు చేసేవారట, కానీ నేడు ప్రదక్షిణలు చేయడానికి ఏమాత్రము అవకాశము లేకుండా నందీశ్వరుడు
పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ ప్రకారం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళము వరకు ఇక్కడి నందీశ్వరుడు పెరుగుతున్నట్టు అంచనా
వేశారు. “శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి” వారు తన కాలజ్ఞానంలో
యాగంటి బసవయ్య అంతకంతకూ పెరిగి కలియుగాంతమున కాలుదువ్వి రంకె వేయును అని వ్రాశారు.
యాగంటి గుహలు :
ఈ యాగంటి
క్షేత్రంలోని పరిసర ప్రాంతములో వున్న కొండలను “ఎర్రమల కొండలు”గా పిలుస్తారు. ఈ
ఎర్రమల కొండల యందు సహజ సిద్దంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
ఇప్పుడు ఇక్కడి గుహల గురించి తెలుసుకుందాం.
- రోకళ్ళ
గుహ
- శ్రీ
వేంకటేశ్వర స్వామి గుహ
- శంకర
గుహ
రోకళ్ళ గుహ :
ఈ గుహకు
“ముక్కంటి గుహ” మరియు “రొకళ్ళ గుహ” అను వివిధ పేర్లు వున్నాయి. ఈ రొకళ్ళ గుహలో
అగస్త్య మహాముని ఒక శివలింగాన్ని ప్రతిష్టించుకొని ధ్యానం చేశారని ప్రతీతి.
శ్రీ వేంకటేశ్వర స్వామి గుహ :
అగస్త్య
మహర్షి ప్రతిష్టించాలనకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహంను ఈ గుహలో
ప్రతిష్టించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహంలో చిన్న లోపం వుండడం వల్ల ఆ
విగ్రహము ప్రతిష్టకు అనర్హంగా భావించి ఈ గుహలో భద్రపరిచారు.
శంకర గుహ :
ప్రకృతి
సౌందర్యం మరియు ప్రశాంతత ఈ గుహ యొక్క ప్రత్యేకత. ధ్యానము చేసుకొనుటకు అనుకూలమైన
ప్రదేశము ఈ గుహ. మహామునులు ఎందరో ఇక్కడ తప్పస్సు చేసి మోక్షమును పొందారని ప్రతీతి.
అగస్త్య పుష్కరిణి :
ప్రధాన
ఆలయానికి వాయువ్య భాగంలో సహజంగా ఈ “అగస్త్య పుష్కరిణి” వెలసింది. ఈ యాగంటి
క్షేత్రంనకు 15km దూరంలో వున్న “ముచ్చట్ల క్షేత్రం”లో వున్న నీటిలో అగస్త్య మహర్షి పసుపు
మరియు కుంకుమలు కలుపగా ఆ నీరు వచ్చి ఈ అగస్త్య పుష్కరిణిలో కలిశాయి. ఈ విధంగా
అగస్త్య మహర్షి కనుకొన్న పుష్కరిణిని “అగస్త్య పుష్కరిణి”గా పిలుస్తున్నారు. ఈ
అగస్త్య పుష్కరణి నుండి నీరు ఇక్కడి ఆలయానికి ఎదురుగా వున్న పెద్ద కోనేరుకు
చేరుతుంది. ఈ పెద్ద కోనేరు లోనికి నీరు నంది నోటి నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ
కోనేరు యొక్క గోడల పైన అనేక శిల్పములు చెక్కబడి వున్నాయి.
ఈ క్షేత్రంలో ప్రతి రోజు ఉదయం 6 గంటల
నుండి మధ్యానం 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, శనివారం మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట
నుండి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది.
ఎలా చేరుకోవాలి ?
ఈ యాగంటి
క్షేత్రం బనగానపల్లెకు 13 కిలో మీటర్ల దూరంలో ఉంది. బనగానపల్లె నుండి యాగంటికి పల్లె వెలుగు బస్సులు, షేర్ ఆటోలు ప్రతి రోజూ తిరుగుతుంటాయి. అయితే RTC బస్సు రోజుకు రెండు సార్లు మాత్రమే బనగానపల్లె - యాగంటి మధ్య తిరుగుతుంది, అది కూడా ఉదయం 7 గంటలకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో
వుంటుంది.
సమీపంలోని దర్శనీయ ప్రదేశాలు :
నందవరం శ్రీ
చౌడేశ్వరి దేవి ఆలయం
బెలూన్ గుహలు
నవాబు కోట
అద్దాల మేడ
మంగంపేట జలపాతం
రవ్వల కొండ గుహలు మొదలైనవి
మా అనుభవాలు :
కలియుగాంతంతో
ముడిపడి వున్న యాగంటి క్షేత్రాన్ని చూడాలని చాలా రోజుల నుండి ఎదురుచూస్తూ
వున్నాము. అయితే ఒక రోజు అనుకోకుండా యాగంటికి మా ప్రయాణం మొదలైంది. మేము మొదటగా
బనగానపల్లెకు బస్ ద్వారా చేరుకున్నాము. బనగానపల్లె బస్ స్టేషన్లో దిగి, యాగంటి
బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నాము, అయితే బస్సు ఇప్పుడే
బయలుదేరి వెళ్ళింది మళ్ళీ తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది అని అక్కడి వారు
చెప్పడంతో ఎలాగోలా యాగంటికి వెళ్ళాలి అనుకొని, ఒక ఆటో
అతన్ని అడిగాము తను మా నుండి ఎక్కువ చార్జిని అడిగాడు.
అయితే అప్పటికే యాగంటికి బయలుదేరిన వేరొక ఆటో మాకు కనపడింది వెంటనే దానిలో తక్కువ
చార్జితో (నార్మల్ టిక్కెట్ ప్రైస్) మేము అనుకున్న యాగంటి క్షేత్రాన్ని
చేరుకున్నాము.
అప్పటికే సమయం 2pm అయ్యింది ఆలయంను మూసివేశారు, మళ్ళీ ఆలయాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అక్కడి వారిని అడిగితే 3pmకు తెరుస్తారు అని అన్నారు. అయితే అప్పటికే మాకు ఆకలి వేస్తూ ఉన్నింది, ఆలయానికి సమీపంలో నిత్య అన్నదాన సత్రం ఒకటి కనపడింది, వెంటనే అక్కడికి వెళ్ళాము, వారు మమ్మల్ని
పిలిచి భోజనం పెట్టారు అక్కడి భోజనం చాలా బాగుంది. మా భోజనం పూర్తి అయ్యింది, మా మొబైల్లో చార్జింగ్ కూడా అయిపోయింది, సమీపంలోని
దుకాణంలో చార్జింగ్ కోసం రిక్వెస్ట్ చేసి మా మొబైల్స్ కి చార్జింగ్
పెట్టుకున్నాము.
ఇంతలోనే ఆలయం తెరిచే సమయం అయ్యింది. అయితే మేము మొదటగా ఆలయంలోకి వెళ్లకుండా ఆలయ
సమీపంలో వున్న గుహలను చూడటానికి వెళ్ళాము. అలా మేము మొదటగా శంకర గుహలోకి వెళ్ళాము.
ఈ గుహ ఒక కొండ మీద వుంది, పైకి ఎక్కడానికి కొన్ని
మెట్లు నిర్మించారు. పైకి చేరుకున్నాక చుట్టూ వున్న దృశ్యాలు మమ్మలని కనువిందు
పరిచాయి. ఈ గుహ సమీపంలో చాలా కోతులు వుంటాయి, అయితే
వాటితో కొంచెం జాగ్రత్తగా వుండాలి. మేము గుహ లోనికి ప్రవేశించాము, లోపల చాలా ప్రశాంత వాతావరణం మాకు కనిపించింది, అంటే
ఇక్కడ ప్రశాంతంగా వుంటడం వల్లనే చాలా మంది మహామునులు ఇక్కడ తపస్సు చేసే వారట.
శంకర గుహను దర్శించుకున్నాక కుడి వైపున కొన్ని మెట్లు కనిపించాయి ఆ మెట్లు ద్వారా
వెళ్తే మనం శ్రీ వేంకటేశ్వర స్వామి గుహ, రోకళ్ల గుహలకు
చేరుకుంటాము. మేము ఈ రెండు గుహల్లో మొదటగా రొకళ్ళ గుహకు వెళ్ళాము ఈ గుహ చాలా
అద్భుతంగా వుంది, లోపల చాలా పావురాలు వున్నాయి, మరియు గుహ పైభాగం కొద్ది వరకు ఓపెన్లో వుంటుంది ఆ దృశ్యం చూడడానికి చాలా
అద్భుతంగా వుంటుంది. ఈ రొకళ్ల గుహలో అగస్త్య మహర్షి శివలింగాన్ని ప్రతిష్టించారు.
ఈ గుహ కూడా కొండ పైన వుంటుంది, గుహ పైనుండి ఉమామహేశ్వర
స్వామి ఆలయం, యాగంటి బసవయ్య చాలా బాగా కనిపిస్తాయి.
రోకళ్ళ గుహను సందర్శించాక మేము “శ్రీ వేంకటేశ్వర స్వామి గుహకు” వెళ్ళాము. ఈ గుహ
కూడా కొండ పైన వుంటుంది అయితే మిగిలిన గుహలతో పోలిస్తే ఈ గుహ యొక్క మెట్లు చాలా
బాగుంటాయి మరియు ఈ గుహకు ఎదురుగా ఒక వంతెన వుంటుంది దాని మీద నుండి వెళ్తే ప్రధాన
ఆలయం దగ్గరకు వెళ్తాము. ఈ గుహలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు నెలకొని వున్నారు.
వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాక ప్రధాన ఆలయంనకు వెళ్ళాము (వంతెన
పైనుండి) ఆలయం లోపల శ్రీ ఉమాహేశ్వర స్వామి వారు నెలకొని వున్నారు. ఆలయంనకు ఈశాన్యం
వైపు నందీశ్వరుడు వున్నాడు, ఈయననే యాగంటి బసవయ్య అని
పిలుస్తారు, బ్రహ్మం గారు చెప్పిన “యాగంటి బసవయ్య రంకె
వేయును’ అని అన్నది ఈ నంది గురించే. ఇక్కడి నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ
వుంటుంది. ఆలయం వాయువ్య భాగంలో అగస్త్య పుష్కరిణీ వుంటుంది. ఈ పుష్కరిణీ నీళ్ళు
ఆలయం ముందు భాగంలో వున్న పెద్ద కోనేరు లోకి వెళ్తుంది. ఈ పెద్ద కోనేరు కూడా ఈ
ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి.
ఈ ప్రదేశాలన్నీ చూసేలోపు మా చివరి బస్సు కూడా వచ్చేసింది, ఇక మేము ఆలస్యం చేయకుండా తిరిగి మా ప్రయాణం మొదలుపెట్టాము. మీరు కూడా ఈ
క్షేత్రంను దర్శించినట్లైతే కింద కామెంట్ చేయండి. ఇంకా
మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు