Alurukona
ఆలూరు కోనలో చూడవలసిన ప్రదేశాలు
ఆలూరు కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వున్న తాడిపత్రి
పట్టణంలో వుంది. ఇక్కడ చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆలురు
కోన రంగనాయకుల స్వామి ఆలయం మరియు హాజివలి దర్గా చూడవలసిన ప్రదేశాలు. ఇప్పుడు ఈ
ఆర్టికల్లో ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ఆలూరు కోనలో చూడవలసిన ప్రదేశాలు :
- ఆలూరు కోన
- జలపాతం
- హజీవలి దర్గా
ఆలూరు కోన :
ఆలూరు కోన తాడిపత్రి నుండి 6km దూరంలో
వుంది, దట్టమైన అడవిలో పక్షులు కిలకిలరావాల మధ్య ఈ క్షేత్రం నెలకొనివుంది. పురాణాల
ప్రకారం ఈ క్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు చేత నిర్మించబడింది. ప్రతి
సంవత్సరం చైత్ర మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో
గర్భాలయానికి కుడివైపున ఆళ్వార్ల సన్నిధి మరియు ఆలయంనకు యెడమ వైపున సమస్త
సద్గురువు శ్రీ సాయినాధుని మందిరం వున్నాయి. ఆలయం సమీపంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే మార్గంలో అన్నదానం చేసే ఒక భవనం
వుంది, అక్కడ నిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తూ వుంటారు. ఆ భవనంలోనే
భక్తులకు రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయానికి కుడి వైపున వున్న సాయిబాబా
మందిరం వద్ద ఒక కళ్యాణ మంటపం కూడా ఇక్కడ కొత్తగా నిర్మించారు.
ఆలయ చరిత్ర :
ఒకసారి ఒక దట్టమైన అడవిలో విశ్వామిత్ర మహర్షి యాగం చేయడానికి సంకల్పించారు, వారు యాగం చేస్తూ వుంటే తాటకి అనే రాక్షసి యొక్క తమ్ముడైన మారీచుడు మరియు మరి
కొందరు రాక్షసులు విశ్వామిత్ర మహర్షి జరిపించే యాగాలను చిన్నాభిన్నం చేసేవారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వెళ్లి దశరథ మహారాజుని కలిసి తాటకి చేస్తున్న
అక్రమాలను అరికట్టడానికి చిన్నపిల్లలైన రామలక్ష్మనులను పంపి లోకాన్ని కాపాడమని కోరారు. అప్పుడు శ్రీరాముల వారు తన బాణంతో తాటకిని సంహరిస్తారు. తరువాత యాగం మొదలై
నిరాటంకంగా సాగుతుంది. విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతమే ఈ ఆలురు కొన.
ఆలూరు కోన జలపాతం :
ఆలూరు కోనకు వచ్చిన తరువాత ఇక్కడి జలపాతాన్ని చూడకుండా ఎవరూ వెళ్ళలేరు, ఈ జలపాతం
ఆలయానికి వెనుక భాగంలో వుంటుంది అందరూ ఈ జలపాతానికి ముందర వున్న చిన్న కొలనును
స్వామి వారి పుష్కరిణీ అని పిలుస్తారు. ఆలయానికి యెడమ వైపున ఉన్న చిన్న మార్గం
మనల్ని జలపాతం దగ్గరకు తీసుకెళ్తుంది, జలపాతానికి
దగ్గర శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వుంది ఈ ఆలయానికి కుడి వైపు నుండి కొండ మీదకు
చిన్న దారి వుంటుంది ఆ మార్గంలో ద్వారా వెళ్తే జలపాతం యొక్క మరిన్ని అందాలను
చూడవచ్చు. ఇక్కడ వున్న కొండ రాళ్ళు మామూలు రాళ్ళ వలె కాకుండా చిన్న చిన్న
గులకరాళ్లు అతుక్కొని వున్న ఒక బండ రాతిలాగా వుంటాయి, అవి
చూడటానికి చాలా అందంగా కూడా వుంటాయి.
హజివలి దర్గా :
హాజివలి దర్గా, ఆలూరు కోన కంటె ముందుగానే వస్తుంది. ఆలూరు కోనకు వెళ్లాలంటే ఈ దర్గాను
దాటుకొనే వెళ్ళాలి. దర్గాకు సమీపంలో సోలార్ విద్యుత్ కేంద్రం ఉంది మరియు పెన్నా
సిమెంటు కార్మాగారం కూడా వుంది. ఈ దర్గా తాడిపత్రి నుండి 4kmల దూరంలో
ఉంది.
ఈ హజివలి దర్గాను ముస్లింల కంటే ఎక్కువగా హిందువులు ఆరాధిస్తారు. ఇక్కడ
కొలువైవున్న స్వామి వారిని “కామిల్ వలి హజరత్ హాజీవలి రహ్మతుల్లా అలై” బాబా గారు
అని అంటారు, మనం హాజివలి దర్గాగా ఇప్పుడు పిలుస్తున్నాం. హాజివలి స్వామి వారు ఇక్కడ జీవ
సమాధి అయ్యారు, దర్గా లోపలికి మొగవారికి మాత్రమే ప్రవేశం కలదు, ఆడవారికి
ప్రవేశం లేదు.
హజీవలి స్వామి వారు 400ల సంవత్సరాల పూర్వం ఒక “పంచకళ్యాని” అనే గుర్రం పైన తలారి చెరువుకు 5kmల దూరంలో
వున్న “పులిగానిపల్లె” అనే గ్రామంలోకి వచ్చి ఒక చోట బండరాతి మీద కూర్చున్నారట, ఆ బండరాతిని
ఇప్పుడు “చిల్లా పహాడ్” అని పిలుస్తారు. స్వామి వారు కూర్చున్న బండ రాతి మీద ఆయన
పాదముద్రలు చూడవచ్చు, అక్కడ మనం ఒక చిన్న జలపాతంను కూడా చూడవచ్చు.
దర్గా ఆవరణంలో దస్తగిరి స్వామి వారి దర్గా కుడా వుంది. దీనిని ఎక్కువగా
దస్తగిరి స్వామి కట్ట అని పిలుస్తారు, ఇక్కడ
గ్యార్మి పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. దర్గాకు సమీపంలో ఒక మసీదు కూడా వుంది.
చరిత్ర :
ఇక్కడ దగ్గరలో “తలారి చెరువు” అనే ఒక గ్రామం వుంది. ఆ గ్రామం లోకి ఒక దొంగ
దొంగతనానికి రావడంతో, అతన్ని ఆ ఊరి ప్రజలు కొట్టి చంపారు, ఆ తరువాత ఆ
ఊరిలో వారికి ఎవరికి కుడా సంతానం కలుగక, వర్షాలు
కూడా పడక కరువు కాటకాలతో చాలా ఇబ్బంది పడ్డారు, వెంటనే ఆ
ఊరి ప్రజలు అందరు కలిసి ఒక పండితున్ని అడగగా, అతను మీరు
చంపిన దొంగ ఒక బ్రాహ్మణుడు అని అతన్ని చంపడం వలన ఊరికి పాపం చేకూరింది అని
చెప్పారు. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆ ఊరి ప్రజలు అడగగా, దగ్గరలో
వున్న దర్గా దగ్గరికి వెళ్ళండి మరియు ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ రోజున మీ
ఇళ్ళల్లో ఎవరూ కూడా దీపాలు వెలుగించరాదు మరియు పొయ్యి కూడా వెలుగించరాదు అందరూ
కూడా వాకిళ్లు వేసి దర్గాలోకి వెళ్ళమని చెప్పారు.
అప్పటి నుండి ఆ ఊరి ప్రజలు ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ రోజున ఆ ఊరి ప్రజలు
అందరు తమ ఇళ్లకు వాకిళ్లు వేసి దార్గా దగ్గరకు వెళ్లేవారు మరియు అక్కడే వంట కూడా
వండుకునే వారు. ఈ ఆచారాన్ని “అగ్గిపాడు” అని పిలుస్తారు. ఈ అగ్గిపాడు ఆచారాన్ని ఆ ఊరి
ప్రజలు ఇప్పటికీ కూడా పాటిస్తూ వున్నారు. ఆ రోజు మాత్రం వాళ్ళ ఊరిలోకి వేరే
వారికి ప్రవేశం వుండదు మరియు ఆ ఊరి ప్రజలు వేరే ఊరికి వెళ్ళరు. వీరంతా ఈ దర్గాలో
వుంటే హజివలీ స్వామి వారు ఊర్లోకి వెళ్లి ఆ కరువు కాటకాలను తీసివేసి ప్రజలు అంతా
సుభిక్షంగా ఉండేలా చేస్తారు అని ఆ పాప నివారణ చేస్తారని అక్కడి ప్రజలందరి నమ్మకం
అంతగా అందరు ఈ దేవుణ్ణి కొలుస్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ ప్రతి మాఘ పౌర్ణమి
తరువాత వచ్చే మొదటి గురువారం గంధం ఉరుసు ఉత్సవాలు 3 రోజుల పాటు
ఘనంగా నిర్వహిస్తారు.
ఎలా చేరుకోవాలి ?
ఆలూరు కోన చేరుకోవడానికి తాడిపత్రి నుండి బస్ సౌకర్యం కూడా కలదు అది కూడా నిర్ణీత సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ప్రైవేట్ వాహనాల ద్వారా కుడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి వచ్చే మార్గం ఒంపులతో కూడుకొని ఉంటుంది, ఈ ఒంపులతో కూడిన ప్రయాణం కుడా మనకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.
మా ప్రయాణం :
మేము మొదటగా తాడిపత్రి చేరుకొని అక్కడి నుండి హాజివలి దర్గాకు వెళ్ళాము.
కొంచెం ఫ్రెష్అప్ అయ్యి దర్గాలోకి వెళ్ళాము, దర్గాలోకి
వెళ్లగానే పావురాలు మాకు స్వాగతం పలికాయి. అలాగే ముందుకు వెళ్లి దర్గా లోపలికి
వెళ్ళాము అక్కడ ఫాతహ (సదివింపులు) ఇచ్చి హజివలి స్వామి వారిని దర్శించుకున్నాము, తరువాత
దస్తగిరి స్వామి వారిని కూడా దర్శించుకున్నాము. దర్గాలో కొంచెం సేపు కూర్చొని
మళ్ళీ ఆలూరు కోనకు మా ప్రయాణం మొదలు పెట్టాము.
దర్గాకు పక్కన వున్న రోడ్డు మార్గం మమ్మల్ని ఆలూరు కోనకు తీసుకువెళ్ళింది, ఆ మార్గం
అనేకమైన వొంపులతో కూడుకొని వుంది. ఎలాగోలా మేము ఆలూరు కోనకు చేరుకున్నాము. ఆలూరు
కోనకు వెళ్లగానే మాకు జలపాతాల చప్పల్లు వినిపించాయి, అలాగే
ముందుకు వెళ్లగానే మాకు ఎదురుగా కొన్ని మెట్లు కనిపించాయి. మెట్లు ఎక్కి పైకి
వెళ్ళగానే మాకు “శ్రీ రంగనాయకుల స్వామి ఆలయం” కనిపించింది. మేము ఆలయం లోపలికి
వెళ్ళాము అక్కడ అతిపెద్ద ధ్వజ స్తంభం మాకు స్వాగతం పలికింది, అలాగే
ముందుకు వెళ్లి ఆలయం లోపలికి ప్రవేశించాము. తరువాత మేము స్వామి వారిని
దర్శించికొని ఆలయం బయటకు వచ్చాము.
బయటకు రాగానే మాకు స్వామివారి కొనేరుకు దారి అని కనబడింది, సరే చూద్దాం
అనుకొని ఆ మార్గంలో వెళ్ళాము దారిలో మాకు అన్నదాన సత్రం అని కనబడింది, అప్పటికే
మాకు ఆకలి వేయడంతో లోపలికి వెళ్ళాము, అక్కడ భోజనం
చేసాము (భోజనం చాలా రుచికరంగా వుంది) మళ్ళీ మేము కోనేరుకు పయనమయ్యాము. అలాగే
ముందుకు వెళ్లగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం మాకు దర్శనమిచ్చింది, అక్కడ
స్వామి వారిని కూడా దర్శించుకొని కోనేరుకు వెళ్ళాము. కొనేరు ఆలయానికి పక్కనే వుంది, కొంచెం సేపు
కోనేరులో సమయాన్ని గడిపాము. ఆంజనేయ స్వామి ఆలయం వెనుక భాగంలో ఒక కొండ మార్గం
కనబడింది, ఆ మార్గంలో వెళ్తే ఎక్కడికి వెళ్తాము అని అక్కడి వారిని అడిగాము వారు పైన ఇంకా
చాలా చిన్న చిన్న జలపాతాలు వున్నాయన్నారు. మేము వెంటనే పైకి కూడా వెళ్ళాము అక్కడి
జలపాతాల దృశ్యాలు చూసి ఆనందించాము. మీరు కూడా ఈ ప్రదేశాలను చూసి వుంటే కింద
కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు