bhairavakona
భైరవకోనలో చూడవలసిన ప్రదేశాలు
త్రిమూర్తులు ఒకే చోట వున్న అరుదైన ప్రదేశంగా ఈ భైరవకోన ప్రసిద్ధి
చెందింది. ఇది ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలో వున్న అంబవరం మరియు
కొత్తపల్లి గ్రామం సమీపంలో వుంది. ఇక్కడ అనేకమైన గుహలు, జలపాతాలు
వున్నాయి. క్రీ.శ 600 నుండి 630 సంవత్సర కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఒకే కొండలో మలచిన 8 శివాలయాలను ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు
తూర్పు ముఖానికి, ఒక్క దేవాలయం మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడి ఉంటాయి. భైరవకోన గుహాలయాల్లో
నెలకొన్న ప్రధాన దైవం “భర్గేశ్వరుడు” ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు “భైరవుడు” ఆయన
పేరుమీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు
సుప్రసిద్ధ క్షేత్రాలలోని శివలింగాలను పోలి వుండడంతో వీటిని కూడా ఆ పేర్లతోనే
పిలుస్తున్నారు.
భైరవకోనలో చూడవలసిన ప్రదేశాలు :
- భైరవకోన లోని 8 గుహాలయాలు
- శ్రీ తిముఖదుర్గా భర్గులేశ్వర లింగం
- అన్నపూర్ణేశ్వరిదేవీ గుహ
- దేవదారు వృక్షం
- శ్రీ దుర్గాంబ ఆలయం
- భైరవకోన జలపాతం
- జ్ఞానమందిరం
భైరవకోన లోని 8 గుహాలయాలు :
శశినాగ లింగం, రుద్ర లింగం, విశ్వేశ్వర లింగం (లేదా) కాశీ
లింగం, నగరేశ్వర లింగం, భర్గేశ్వర
లింగం, రామేశ్వర లింగం, మల్లికార్జున లింగం, పక్షఘాత లింగం.
శశినాగ లింగం :
భైరవకోన గుహలలో మొదటి గుహ ఈ శశినాగ లింగం ఇది ఉత్తర ముఖంగా చెక్కబడి వుంటుంది, మిగిలిన
గుహాలయాలు అన్నీ కూడా తూర్పు ముఖంగా చెక్కబడి ఉంటాయి. ఈ గుహాలయానికి ఎదురుగా ఒక
నంది ఆశీనమై వుంటుంది, తలపాగలు ధరించిన ద్వారపాలక శిల్పాలు (శృంగి మరియు బృంగి) ఈ గుహ యొక్క ప్రధాన
ఆకర్షణ. అంతే కాకుండా బ్రహ్మ, విష్ణు, చండీశ్వరుడు
మరియు విఘ్నేశ్వర స్వామి శిల్పాలు కూడా ఇక్కడ చెక్కబడి వుంటాయి. అయితే అన్నింటి
కంటే ఏడవ గుహాలయం మాత్రం అతి సుందరంగా కనిపిస్తుంటుంది. ఈ గుహాలయం లోని శివలింగం, మధ్యప్రదేశ్
లోని “అమరనాథ్”లో కనిపించే “శశినాగ లింగంను” పోలివుండడంతో దీనిని కూడా అదే పేరుతో
పిలుస్తున్నారు.
కాశీ లింగం :
భైరవకోన గుహాలయాలలో ఇది రెండవది. దీనిని విశ్వేశ్వర లింగం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే
ఇది కాశీలో కనిపించే విశ్వేశ్వర లింగంను పోలి వుంటుంది.
రామేశ్వర లింగం :
ఈ గుహాలయం లోని శివలింగం రామేశ్వరంలోని శివలింగాన్ని పోలి వుండడంతో దీనిని
కూడా “రామేశ్వర లింగం” అని పిలుస్తున్నారు. ఈ గుహలోని శివలింగం ఇసుక రాతితో
చేయబడి ఉంటుంది, అందువలన స్వామి వారు మనకు ఎరుపు రంగులో కనిపిస్తారు.
రుద్ర లింగం :
ఈ గుహలో కనిపించే శివలింగం మేరు పర్వతాలలోని “రుద్ర లింగంను” పోలి వుంటుంది, అందువలన
దీనిని కూడా అదే పేరుతో పిలుస్తారు.
నగరేశ్వర లింగం :
ఈ గుహాలయం లోని శివలింగం తిరుమల కొండలలోని “నగరేశ్వర లింగం” వలె వుంటుంది, కాబట్టి
దీనిని కూడా “నగరేశ్వర లింగం” అని పిలుస్తున్నారు. ఈ గుహాలయం లోని శివలింగానికి ఒక
ప్రత్యేకత వుంది, అదేమిటంటే ఇక్కడి మిగిలిన గుహాలయాల లోని శివలింగాలు ప్రతిష్టించినవి కానీ ఈ
ఆలయం లోని శివలింగం మాత్రం ఇక్కడి కొండరాతి తోనే మలిచింది. ఈ గుహాలయం కొండకు పైన
వుంటుంది కాబట్టి పైకి ఎక్కడం కోసం మెట్లు (వంతెన) నిర్మించారు.
శ్రీశైల మల్లికార్జున లింగము :
ఈ గుహాలయం లోని శివలింగం శ్రీశైలం లోని మల్లికార్జున స్వామిని పోలి ఉంటుంది
అందువలన దీనిని కూడా శ్రీశైల మల్లికార్జున లింగము అని పిలుస్తున్నారు. అన్ని
గుహాలయాల ముందు నంది విగ్రహం దర్శనమిస్తుంది ఐతే ఇక్కడ మాత్రం నంది విగ్రహం
వుండదు. (ముందు వుండేదట, కానీ ప్రస్తుతం లేదు).
పక్షఘాత లింగం :
భైరవకోన గుహాలయాలలో ఇది ఏడవది. దీనికి ఒక ప్రత్యేకత వుంది అదేమిటంటే, మిగిలిన
గుహాలయల కంటే ఈ గుహాలయం అతి సుందరంగా ఉంటుంది, ఎందుకంటే
మిగిలిన వాటితో పోలిస్తే ఈ గుహాలయానికి ఎక్కువ శిల్పకళ వుంటుంది, అంతే
కాకుండా దీనికి మరియొక ప్రత్యేకత కూడా ఉంది, అదేమిటంటే ఈ
స్వామి వారి కింద ఒక రంద్రం ఉంటుంది, అందులో దాదాపు పది
అడుగుల లోతు వరకు నీళ్ళు వుంటాయి. ఈ అద్భుత దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.
అష్టకాలప్రచండ భైరవలింగం :
ఈ గుహాలయం 8వ గుహాలయం, ఈ గుహాలయం లోని స్వామి వారిని భైరవ స్వామికి ప్రతిబింబంగా చెబుతారు. కొన్ని
గుహాలయాలకు మాత్రమే శేశమునీంద్రులు వుంటారు (చిన్న మనిషి రూపంలో వుండే శిల్పాలు
ఇవి గుహాలయాలకు బయట చెక్కబడి ఉంటాయి) వీరు ఇక్కడికి వచ్చిన భక్తుల సమాచారాన్ని
స్వామి వారికి అందిస్తూ వుంటారట.
శ్రీ తిముఖదుర్గా భర్గులేశ్వర లింగం :
ఈ గుహాలయము ఇక్కడి ప్రధాన దేవాలయము మరియు దీనిని 9 వ గుహాలయంగా చెప్పుకోవచ్చు.
ఈ ఆలయం లోని అమ్మవారి విగ్రహం మీద ప్రతి కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణలు పడటం
భైరవకోనకు వున్న మరొక విశేషం, అందుకే ఆ
రోజున భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందర “భర్గులేశ్వర
స్వామి” నెలకొని వున్నారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక చిన్న కొండమీద ఈ ఆలయ
క్షేత్రపాలకుడు అయిన “బైరవస్వామి ఆలయం” వుంటుంది.
అన్నపూర్ణేశ్వరి దేవీ గుహ :
ఇక్కడ ప్రధాన ఆలయానికి సమీపంలో చిన్న కొండ మీదకు మెట్లువున్నాయి, పైన చిన్న
గుహలో లక్ష్మిదేవి, అన్నపూర్నేశ్వరి దేవీ వారి చిన్న విగ్రహాలు వున్నాయి. మరియు లోపల ఒక జ్యోతి
కూడా వెలుగుతూ వుంటుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిన వారిలో “శ్రీ
అన్నకావిళ్ళ సుబ్బయ్య తాత” అనే ఆయన ముఖ్యులు. ఆయన విగ్రహం కూడా ఇక్కడ వుంటుంది.
ఇక్కడ అన్నపుర్నేశ్వరి దేవీ కొలువై వుండటానికి కూడా ఆయనే కారణం. ఆయన శివ భక్తుడు, శివుడు
స్వప్న దర్శనమిచ్చి నిన్ను కరునిస్తాను అని అన్నాడట, కానీ
ఎన్నాల్లకూ కనికరించలేదట, అప్పుడు ఆయన అమ్మతో మొరబెట్టుకున్నాడు. ఆయన ఆర్తి గమనించి అన్నపుర్నేశ్వరీ
రూపాన అమ్మవారు కనిపించిందట, మరి నిన్ను
నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తునికి పరిక్ష పెట్టిందట ఆ అమ్మవారు. అప్పుడు ఆ
భక్తుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను మంచి చేయాలి, అలా నాకు
వరమివ్వు, నేను బ్రతికున్నంతకాలం నీకు ఏదో విధంగా నైవేద్యం పెడతానని చేప్పాడట. ఆయన
పరోపకారతత్వాన్ని గ్రహించిన జగజ్జనని ఆయన్ని అనుగ్రహించడమే గాక, అన్నపూర్ణాదేవిగా
అక్కడే స్థిరపడ్డారు.
దేవదారు వృక్షం :
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు జీవ సమాధి అయ్యే సమయంలో తన శిష్యుడైన
సిద్ధయ్యకు పూలు తీసుకురమ్మని చెప్పిన చెట్టు ఇదే. ఇది కొండపైన వున్న జ్యోతి
సమీపంలో వుంది. ఈ అద్భుత దృశ్యాన్ని కూడా మనం భైరవకోనలో చూడవచ్చు.
శ్రీ దుర్గాంబ ఆలయం :
భైరవకోన ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలో కుడివైపున కొన్ని మెట్లు మనకు
కనిపిస్తాయి, పైకి ఎక్కి వెళితే శ్రీ దుర్గాంబ ఆలయం మనకు దర్శనమిస్తుంది. చాలా మంది ఇక్కడకు
వెళ్ళరు ఎందుకంటే చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు. ఈ సారి మీరు
వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి.
భైరవకోన జలపాతం :
భైరవకోన లోని మరో విశేషం అందాల జలపాతం, ఇది సుమారు 200 మీటర్లు
ఎత్తు నుండి పడుతూ ఇక్కడకు వచ్చే యాత్రికులను కనువిందు చేస్తుంది. భక్తులు ప్రతి
గురువారం, ఆదివారం మరియు వేసవి కాలంలో ఇక్కడికి వస్తూ వుంటారు. ఈ భైరవకోనలో దిగగానే మనకు
కనిపించేది పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, విగ్రహం
పక్కన వుండే దారి ద్వారా లోపలికి వెళ్తే 200 మీటర్ల
ఎత్తు నుండి దూకే జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలప్రవాహం తను పయనించే దారిలో
వున్న వివిధ వైద్య మూలికలను తాకుతూ ప్రవహించడంతో ఆ నీటిలో స్నానం చేసిన వారికి
అనేక రుగ్మతల నుండి విముక్తి లభస్తుందని నమ్మకం. అందుకే ఇక్కడ నీరు ఎంత తక్కువ
వున్నా సరే చాలా మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తుంటారు.
జలపాతానికి ఎడమ వైపు కొండ మీదకు దారి వుంటుంది, ఐతే పైకి
ఎక్కడం కొంచెం కష్టంగా వుంటుంది. కొండ మీదకు ఎక్కిన తరువాత మనం అందమైన ప్రకృతి
దృశ్యాలను చూడవచ్చు అలాగే ఇంకొంచెం ముందుకు పైకి వెళ్తే అధ్బుతమైన మరియొక రెండు
జలపాతాలను చూడవచ్చు. ఈ ఆలయం లోని కొండ మట్టిని “పొలి” అంటారు, ఈ ఆలయానికి
సమీపంలో వున్న కొండ మట్టిని భక్తులు తీసుకువచ్చి పొలాలలో చల్లుతుంటారు.
ఆయుర్వేదానికి అవసరమైన అనేక ఔషధ మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి.
జ్ఞానమందిరం :
శ్రీ అన్నపూర్ణ కావిడి సుబ్బయ్య తాత జ్ఞానమందిరం ఇది భైరవకోనకు వెళ్ళే
మార్గంలో కనిపిస్తుంది, ఇక్కడే అవధూత రామయ్య స్వామి సమాధిని కూడా చూడవచ్చు పక్కనే ఒక అందమైన బావిని
కూడా చూడవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే నిత్య అన్నదాన సత్రం కూడా కనిపిస్తుంది.
అన్నదాన సత్రంలో భోజనం చాలా రుచికరంగా ఉంటుంది.
ఎలా చేరుకోవాలి ?
రోడ్డు
మార్గం : చంద్రశేఖరపురం
– 23 km, పామూరు – 35 km, పోరుమామిళ్ల – 46 km, కనిగిరి -
62 km
రైలు మార్గం
: కావలి – 115 km, ఒంగోలు – 140 km, కడప - 122 km, నెల్లూరు – 136 km
విమానాశ్రయం
: చెన్నై –
308 km, తిరుపతి –
209 km, కడప – 120 km. ఇంకా మీకు
ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు