సిద్ధవటం కోటలో చూడవలసిన ప్రదేశాలు

సిద్ధవటం కోట ఆంధ్ర ప్రదేశ్ రాస్ట్రం లోని కడప జిల్లాలో వున్న సిద్ధవటం మండలం లోని సిద్ధవటం గ్రామంలో వుంది. కడప నుండి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున ఈ సిద్ధవటం కోట వుంది. ఈ ప్రాంతంలో సిద్ధులు నివసిస్తూ వుండేవారు మరియు వట వృక్షాలు అంటే మర్రి చెట్లు విస్తారంగా వుండేవి. అందువల్ల ఈ ప్రాంతానికి “ సిద్ధవటం ” అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాలలో జైనులు కూడా నివసిస్తూ వుండేవారు. క్రీ. పూ 40 - 30 సంవత్సరాల మధ్య కాలంలో ఈ సిద్ధవటం రూపుదిద్దుకుంది. సిద్ధవటం సమీపం లోని  నదిపొడువునా అనేక దేవాలయాలు వున్నాయిఅందులో “ శ్రీ రంగనాథ స్వామి ఆలయం ” చెప్పుకోదగ్గది. ప్రముఖ శైవక్షేత్రం అయిన శ్రీశైలానికి ఈ సిద్దవటం దక్షిణ ద్వారంగా పేరుగాంచింది. చుట్టు దట్టమైన లంకమల్ల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సిద్దవటం కోట వుంది. 1956లో ఈ సిద్ధవటం కోట పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చింది.

సిద్దవటం కోట చరిత్ర :

పవిత్ర పెన్నా నది ఒడ్డున వున్న ఈ సిద్దవటం కోటను తొలత పల్లవులుచోళులుకాకతీయులు తరువాత విజయనగర మహారాజులు పరిపాలించారు. అయితే 11 వ శతాబ్దానికి ముందే ఈ సిద్దవటం కోట నిర్మితమైందనిఆనాటి నందన చక్రవర్తి ఇక్కడ మట్టి కోటను నిర్మించాడని తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన “ వీర నరసింహరాయలు ” క్రీ. శ 150నుండి 1509 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పరిపాలనా కాలంలో సిద్దవటం ప్రాంతాన్ని “ సంబెట గురవరాజు ” అనే సామంతుడు పరిపాలిస్తూ  వుండేవాడు. ఈ “ సంబెట గురవరాజు ” ప్రజలకు ఘోరమైన శిక్షలు విధించేవాడు. ప్రజల వద్ద నుండి ధనాన్ని వసూలు చేసేటప్పుడు ధనం ఇవ్వని వారి స్త్రీలను అసభ్యంగా వారి స్థానాలకు చిరతలు పట్టించేవాడు. ఒక రోజు కూచిపూడి నాట్యం చేసే బృందం వారు ఈ గ్రామానికి వచ్చి కూచిపూడి ప్రదర్శనలు చేస్తున్నప్పుడు గురవరాజు యొక్క ఘోర కృత్యాలను చూసి తట్టుకోలేక విజయనగరంకు వెళ్లిపోయారు. మళ్ళీ అక్కడ ( విజయనగరంలో ) “ వీర నరసింహరాయల ” సమక్షంలో కూచిపూడి నాట్య ప్రదర్శన చేసేటప్పుడు గురవరాజు యొక్క వేషం వేసిఅతను డబ్బులు సంపాదించే పద్దతిని మరియు అతను అసభ్యంగా ఆడవారి స్థానాలకు చిరతలు పట్టించడం వంటి కార్యకాలాపాలను రాజు ముందు ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శన చూసి రాజుగారు ఇది ఇలా ఎందుకు వుంది అని ప్రశ్నించగాఅప్పుడు వారిలో కొందరు “ సంబెట గురవరాజు ” చేస్తున్న ఘోర కృత్యాల గురించి రాజుకు ( వీర నరసింహరాయలకు ) వివరించారు. దీంతో నరసింహరాయల వారు ఆగ్రహంతో ( కోపంతో ) మరుసటి రోజు ఉదయాన్నే గురవరాజు పైకి సైన్యాన్ని పంపి అతన్ని బంధీని చేసి మరియు అతనికి మరణశిక్ష విధించి చంపేశారు. తరువాత “ శ్రీ కృష్ణ దేవరాయల ” అల్లుడు “ వరద రాజు ” 1542 లో ఈ కోటను పాలించాడు. అప్పటి కాలంలో ఈ సిద్దవటం కోట ఉదయగిరి రాజ్యంలో భాగంగా వుండేది. “ మట్లి ఎల్లమ రాజు ” అనేక యుద్ధాలలో “ 2 వ వేంకటపతి రాయలకు ” మద్ధతుగా వుండేవాడు. అతని సహాయానికి ఉపకారంగా, “ మట్లి ఎల్లమ రాజుకు ” సిద్దవటం కోటను మరియు చుట్టు ప్రక్కల కొన్ని ప్రాంతాలను బహుమతిగా ఇచ్చారు. మట్లి రాజులు పాలించిన సమయంలో ఈ సిద్ధవటం కోట కేవలం మట్టి కోట మాత్రమే. 1605 వరకూ వున్న ఈ మట్టి కోటను తరువాత “ మట్లి అనంతరాజు ” శతృదుర్భేద్యమైన రాతి కోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత “ ఔరంగజేబు ” సేనాపతి అయిన “ మీర్ జుమ్లా ” 1646 లో  సిద్దవటం కోటను ఆక్రమించి పాలించాడు. ఆ తరువాత 1717 లో  “ ఆర్కాటు నవాబులు ” ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. వారి తరువాత కడపను పాలిస్తున్న “ అబ్దుల్ నబీ ఖాన్ ” సిద్ధవటం కోటను తన ఆధీనం లోకి తెచ్చుకున్నాడు. క్రీ.శ 1792 లో “ టిప్పుసుల్తాన్ ” చేతి నుంచి “ నైజాము నవాబుల ” పాలనలోకితరువాత వారి నుంచి 1808 లో “ తూర్పు ఇండియా వర్తక సంఘం ” ఆధీనం లోకి ఈ కోట చేరింది. బ్రిటీషు వారి పాలనలో 1808 నుంచి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా వుండిపరిపాలన కేంద్రంగా భాసిల్లింది. అయితే ఇది పెన్నా నది ఒడ్డున వున్నందున వరదలు వచ్చిన ప్రతీసారీ కూడా పరిపాలనా కార్యకలాపాలకు ఇబ్బంది వుండేది. అందువల్ల తరువాత కడపను జిల్లా కేంద్రంగా చేశారు. మౌర్యుల నుంచి తూర్పు ఇండియా వర్తక సంఘం ( East India Company ) వరకూ మొత్తం 18 రాజవంశీయులు ఈ సిద్దవటం కోటను పరిపాలించారు.

సిద్ధవటం కోట :

ఈ సిద్దవటం కోట దక్షిణం వైపు పెన్నా నదిమిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శత్రువులు ప్రవేశించేందుకు వీలుకానీ రీతిలో సుమారు 36 ఎకరాల పైబడి విస్తీర్ణంలో నిర్మించబడింది.

సిద్ధవటం కోటలో చూడవలసిన ప్రదేశాలు :

  • కోట ముఖ ద్వారాలు
  • కోట మధ్య భాగం
  • రాణీ దర్బారు
  • ఈద్గా మసీదు
  • నగర ఖానా
  • త్రాగునీటి కోనేరు
  • సిద్ధవటేశ్వర స్వామి ఆలయం
  • తల లేని నంది విగ్రహం
  • కామాక్షీ దేవి ఆలయం
  • హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా షా వలి దర్గా
  • రహస్య సొరంగ మార్గం
  • కోట బురుజులు

కోట ముఖ ద్వారాలు :

ఈ సిద్దవటం కోటకు తూర్పున మరియు పడమరన రెండు ప్రధాన ద్వారాలు వున్నాయి. పడమర వైపున వున్న ప్రధాన ద్వారం ఇరువైపులా ఆంజనేయుని మరియు గరుత్మంతుని యొక్క శిల్పాలు చెక్కబడి వున్నాయి. తూర్పు వైపు వున్న ప్రధాన ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు వున్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహువు గ్రహణం పట్టడం మరియు గ్రహణం విడువడం వంటి చిత్రాలు వున్నాయి. కోట పైభాగం గజలక్ష్మి దేవి అమ్మవారు శిల్పాలతో అలంకరించబడి వుంది.

కోట మధ్య భాగం :

ఈ కోట నిజాం పాలన లోకి వెళ్ళిన తరువాత వాళ్ళు ఈ కోటలో చాలా ఇస్లామిక్ నిర్మాణాలను నిర్మించారు.ఈ కోట యొక్క మధ్య భాగం లోని అంత:పురం శిధిలమై వుంది. ఇంకా ఇక్కడ రాణీ దర్బారుఈద్గా మసీదు మరియు సమీపంలో నగర ఖానా వున్నాయి. నగర ఖానా వెనుక మరియు కోట గోడకు మధ్యలో ఒక త్రాగునీటి కోనేరు వుంది. ఇంకా ఈ కోటలో సిద్ధవటేశ్వర స్వామి ఆలయం కూడా వుంది. ఈ ఆలయానికి ఎదురుగా తల లేని ఒక నంది విగ్రహం వుంది. ఇక్కడ శిథిలం అవుతున్న కామాక్షీ దేవి ఆలయానికి మరమ్మత్తులు చేయించారు.

హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా షా వలి దర్గా :

దక్షిణం వైపు వున్న పెన్నా నదికి సమీపంలో “ హజరత్ సయ్యద్ షా బిల్మిల్లా షా వలి దర్గా ” వుంది. ఈయనను టిప్పు సుల్తాన్ యొక్క సమీప బంధువు అని అంటుంటారు మరియు టిప్పు సుల్తాన్ కాలంలోనే ఈ దర్గాను నిర్మించారు. ఈ దర్గాకు ప్రక్కనే ఒక మసీదు కూడా వుంది.

రహస్య సొరంగ మార్గం :

మసీదుకు తూర్పుగా ఈ కోటలో ఒక సహాయక మార్గం వుందిఅది ఎలాగంటే కోట గోడలో ఒక సొరంగ మార్గాన్ని నది లోకి వెళ్లే విధంగా నిర్మించారు. ఈ రహస్య మార్గాన్ని అప్పటి రాజులు రక్షణ కోసం ఉపయోగించేవారు. పూర్వం ఇక్కడ ఒక చక్ర యంత్రం సాహాయంతో నది లోని నీటిని మసీదు తొట్టి లోకి తోడేవారు.

కోట బురుజులు :

ఈ కోటను రక్షించడానికి కోట చుట్టూ దాదాపు 17 చదరపు బురుజులను నిర్మించారు. ఇప్పటికీ కూడా ఈ బురుజులను ఈ కోటలో చూడవచ్చు. అయితే వీటిలో కొన్ని బురుజులు ప్రస్తుతం శిథిలమై వున్నాయి. ఈ కోటను సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో సందర్శించవచ్చు. ఈ ప్రాంతం ఎండా కాలంలో కూడా సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఈ సిద్ధవటం కోట 700 సంవత్సరాల చరిత్రకు మరియు మధ్య యుగాల కాలం నాటి కళావైభవానికి సజీవ సాక్ష్యం గా నేటికీ అలరారుతోంది.

ఇతర ప్రదేశాలు :

ఈ సిద్దవటం కోటకు సమీపంలోని లంకమల్ల అటవీ ప్రాంతంలో నిత్యపూజ కోన అనే ఒక శివాలయం వుంది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. కడప జిల్లాలో పెద్దఎత్తున శివరాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాలలో ఇక్కడి పొలతల క్షేత్రం తరువాత నిత్యపూజ కోన అనే చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ జ్యోతి క్షేత్రంకపర్తీశ్వర స్వామి కోనశ్రీ రంగనాథ స్వామి ఆలయం మొదలైన ప్రదేశాలు వున్నాయి.   

ఎలా వెళ్ళాలి ?

రోడ్డు మార్గం : కడప నుండి సిద్ధవటం 20 kmల దూరంలో వుంది. హైదరాబాద్ మరియు కొన్ని ముఖ్య నగరాల నుండి కడప వరకు బస్సులు అందుబాటులో వున్నాయి. ఇంకా కడప నుండి సిద్ధవటం వరకు బస్సులు అందుబాటులో వున్నాయి.
రైలు మార్గం : సిద్దవటంకు సమీపం లోని రైల్వే స్టేషన్ కడప మరియు భాకరాపేట. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు ఆటోలు వుంటాయి. ఇక బస్ స్టాండ్ నుండి ఈసీగా సిద్ధవటంకు వెళ్ళవచ్చు.   
విమానాశ్రయాలు : దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు అనుకూలమైన విమానాశ్రయం కడపతిరుపతిమరియు హైదరాబాద్. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.

గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు