కసుమూరులో చూడవలసిన ప్రదేశాలు

కసుమూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో వున్న వెంకటాచలం మండలం లోని ఒక గ్రామం. ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రమైన “ హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖాదరి ( వురుఫ్ ) కాలేషా పీర్ మస్తాన్ వలి ” దర్గా వుంది. ఈ కసుమూరు మస్తాన్ వలి దర్గా సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనం. ఈ స్వామిని దర్శించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండేకాక దేశ నలుమూలల నుండి ముఖ్యంగా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఈ కసుమూరు మస్తాన్ వలి దర్గా రాష్ట్రం లోని ప్రఖ్యాతి గాంచిన ప్రర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. చాలా మంది సెలెబ్రటీలు మరియు ప్రముఖులు ఈ దర్గాను సందర్శిస్తుంటారు.  

చరిత్ర :

గమనిక : ఈ దర్గా గురించి ఖచ్చితమైన చరిత్ర మాకు లభించలేదు, కానీ మాకు లభించిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తాము.
హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరి ( వురుఫ్ ) కాలేషా పీర్ మస్తాన్ వలి స్వామి వారి గురించి చాలా కథలు ప్రచారంలో వున్నాయి, అయితే వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హజరత్ సయ్యద్ మస్తాన్ వలి బాబా గారు ఫాతిమాబీ, కరిముల్లా దంపతులకు జన్మించారట. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వివిధ ప్రాంతాలలో సంచరించి చివరకు నెల్లూరు జిల్లా లోని కసుమూరు గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆయనకు దప్పిక వేయడంతో ఇక్కడే వున్న ఒక గొల్లకాపరి ఇంటికి వెళ్లారట. ఆ గొల్లకాపరిని త్రాగడానికి నీళ్ళు అడిగితే ఆమె మజ్జిగ ఇచ్చిందట. ఆ మజ్జిగను త్రాగి స్వామి వారు తన దప్పికను తీర్చుకున్నారట. స్వామి వారి దప్పికను తీర్చినందుకు ఆ గొల్లకాపరికి ఏదైనా సహాయం చేయాలనుకొని  స్వామి వారు ఆమె వద్ద వున్న గొర్రెలను మేపటం కోసం ఇక్కడి కొండ మీదకు తీసుకువెళతారు. అప్పుడు ఒక పులి అక్కడికి వచ్చి ఆ గొర్రెలలో ఒక దాన్ని చంపి రెండు ముక్కలుగా చేస్తుంది. అప్పుడు స్వామి వారు ఆ గొర్రె యొక్క రెండు ముక్కలను కలిపి మళ్ళీ ఆ గొర్రెను బ్రతికిస్తారు. ఈ సన్నివేశాన్ని మొత్తం ఆ గొర్రెలకాపరి యొక్క భర్త చూస్తాడు. అప్పుడు ఆమె యొక్క భర్త ఆశ్చర్యపోయి తన భార్యతో మస్తాన్ వలి బాబా గారు చాలా మహిమ గలవారు అని, మనం వండే ఆహారంను ముందుగా ఆయనకు పెట్టి తరువాత మనం తిందాం అని చెప్పాడు. ఆవిధంగానే వారు రోజూ చేస్తూ వుండేవారు. కానీ ఒక రోజు ఆమె బయటికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క కోడలు చేపల కూర చేస్తుంది. రోజూ లాగే మస్తాన్ వలి బాబా గారు భోజనానికి వచ్చినప్పుడు, ఆ కోడలు చేపల కూర లోని పెద్ద ముక్కలను వుట్టి మీద పెట్టి, చిన్న చేప ముక్కలను స్వామి వారికి పెడుతుంది. అప్పుడు మస్తాన్ వలి బాబా గారు ఏమమ్మా ! నాకు చిన్న చేప ముక్కలను వడ్డిస్తున్నావు పెద్ద ముక్కలను వడ్డించమ్మా అని అడిగారట. అప్పుడు ఆమె పెద్ద చేప ముక్కలు లేవు, చిన్న ముక్కలే వున్నాయి అని అబద్దం చెప్తుంది. సరే అని స్వామి వారు ఆ చిన్న ముక్కలనే తిని వెళతారు. తరువాత ఆ కోడలు తన భర్తకు వడ్డించడానికి పెద్ద చేప ముక్కలని వుట్టి మీద నుండి కిందికి తీసినప్పుడు ఆ గిన్నెలో చేపలు బ్రతికి ఆడుకుంటూ వుంటాయి. దాంతో ఆ కోడలు ఆశ్చర్యపోయి, అంతలోనే తిరిగి ఇంటికి వచ్చిన ఆమె అత్తతో జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ అత్తగారు ( గొల్లకాపరి ) ఆ కోడలిని మందలించి, స్వామి వారి వద్దకు వెళ్ళి మమ్మల్ని క్షమించమని కోరి తిరిగి ఆమె ఇంటికి రావాలని వేడుకుంటుంది. అప్పుడు స్వామి వారు ఇంతటితో మీ రుణం తీరింది తల్లి ఇక నేను రాలేను అని చెప్పి, స్వామి వారు ఇక్కడి కొండ మీదకు వెళ్ళి అక్కడే వుంటారు. ఇందువల్లనే చాలా మంది భక్తులు స్వామి వారికి చేపల కూరను నైవేధ్యంగా ( ప్రసాదంగా ) పెడుతుంటారు.
కొన్ని రోజుల తరువాత నెల్లూరును పరిపాలిస్తున్న రాజు తనకు చాలా కాలం నుండి పిల్లలు కలుగకపోవడంతో స్వామి వారి వద్దకు వస్తాడు. అప్పుడు మస్తాన్ వలి బాబా గారు ఆ రాజుతో, నువ్వు స్వయంగా అన్నం వండి ప్రజలకు అన్నదానం చేయి నీకు పిల్లలు కలుగుతారు అని చెప్తారు. సరే స్వామి అని ఆ రాజు వడ్లను బియ్యంగా చేసి ఖిచిడిని వండి ప్రజలకు పెట్టాడు. ఆ తరువాత ఆ రాజుకు పిల్లలు కలిగారని చెప్తుంటారు. వెంకటగిరి రాజు గారు స్వామి వారికి ఇక్కడి బంగ్లాను కానుకగా ఇచ్చారని చెప్తుంటారు.  

కసుమూరులో చూడవలసిన ప్రదేశాలు :

  • హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరి ( వురుఫ్ ) కాలేషా పీర్ మస్తాన్ వలి దర్గా 
  • మస్తాన్ వలి బాబా కొండ ( చిల్లా పహాడ్ )
  • షఫా బావి

హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరి (వురుఫ్) కాలేషా పీర్ మస్తాన్ వలి దర్గా : 

ఈ కసుమూరు మస్తాన్ వలి స్వామి వారిని “ జిందే వలి ” అని పిలుస్తుంటారు. మరియు ఈ స్వామి వారు మానసిక వైద్యునిగా ఖ్యాతి పొందారు. ఎన్ని హాస్పిటళ్ళకు వెళ్ళినా నయంకాని జబ్బులను స్వామి వారు నయం చేసేవారట.  
మస్తాన్ వలి బాబా గారి గురించి ఇంకొక కథ ప్రచారంలో వుంది. అదేమిటంటే పూర్వం వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వున్న చెరువు పూర్తిగా నిండి ఈ గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తేదట. ఆ సమయంలో స్వామి వారు ఈ చెరువుకు అడ్డుగా ఇక్కడ వెలిశారని చెప్తూ వుంటారు. అప్పటి నుండి ఈ గ్రామాన్ని వరదల నుండి స్వామి వారు కాపాడుతున్నారని ఇక్కడి వారి విశ్వాసం.

గంధమహోత్సవం :

ఇక్కడ దాదాపుగా 240 సంవత్సరాల నుండి ఘనంగా గంధమహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పవిత్రమైన  రబ్బీ - ఉల్ - అవల్ ” యొక్క 26 వ రోజున ఇక్కడ ఉరుసు ఉత్సవాలు జరుపుతారు. దర్గాకు సమీపంలో వున్న బంగ్లాలో గంధమహోత్సవం నాడు స్వామి వారి గంధాన్ని వుంచి పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ గంధాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించి తీసుకెళతారు.

మస్తాన్ వలి బాబా కొండ ( చిల్లా పహాడ్ ) :

మస్తాన్ వలి బాబా గారు గోళీలు ఆడిన ప్రదేశం :

మస్తాన్ వలి బాబా గారు తన చిన్న వయస్సులో ఈ కొండ పైనే ఆటలాడుకొనే వారని చరిత్ర చెబుతుంది. తన తోటి స్నేహితులతో స్వామి వారు గోళీలు ఆడిన ప్రదేశాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రదేశం లోనే రెండు బండ రాళ్ళ మధ్యలో ఖాళీగా వుండి ఇటుపక్క నుండి అటుపక్కకు వెళ్ళేవిధంగా ఒక సన్నని సొరంగ మార్గం వుంటుంది, ఆ సొరంగ మార్గం నుండి వెళ్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  

ఉయ్యాల బండ :

మస్తాన్ వలి బాబా గారు ఈ కొండ పైనే గేదెలు,గొర్రెలను మేపుతూ నిత్యం ఒక బండపై నిద్రించే వారట. ఆయన నిద్రించిన బండ మీద గుంతలా ఏర్పడి ఒక ఉయ్యాలగా వుంటుంది. నేడు ఆ ప్రాంతాన్ని “ ఉయ్యాల బండ ”గా భక్తులు పిలుస్తుంటారు. ఈ ఉయ్యాల బండలో పిల్లలు లేని వారు పడుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం.  

మర్రి చెట్టు :  

ఈ కొండ పైనే వున్న ఒక మర్రి చెట్టు కింద స్వామి వారు నిత్యం తపస్సు చేసుకునేవారట. ఆ మర్రి వృక్షానికి ముడుపులు, ఉయ్యాలలు కడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంకా మీరు ఈ కొండ ప్రాంతంలో జారుడు బండ మరియు స్వామి వారి పాదాలను దర్శించవచ్చు.

షఫా బావి :

దర్గాకు 3 km దూరంలో వున్న ఒక బావిలో స్వామి వారు నిత్యం స్నానమాచరించేవారు. కాబట్టి ఈ బావిలో స్నానమాచరిస్తే శారీరక రుగ్మతులు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ బావిని “ షఫా బావిగా ” భక్తులు పిలుస్తారు.

ఇతర ప్రదేశాలు :

కసుమూరు చెరువు, స్వామి వారి బంగ్లా మరియు స్వామి వారి దర్గా సమీపంలో వున్న మరికొన్ని చిన్న దర్గాలను సందర్శించవచ్చు. నెల్లూరు నగరంలో వున్న బారా షహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తులు కసుమురు లోని మస్తాన్ వలి దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రతి గురు మరియు శుక్ర వారాలలో ఇక్కడి స్వామి వారిని దర్శించడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.   

ఎలా వెళ్ళాలి ?

రోడ్డు మార్గం : కసుమూరు నెల్లూరు నుండి దాదాపుగా  25 km  దూరంలో వుంది. నెల్లూరు బస్ స్టాండ్ నుండి నేరుగా కసుమురుకు బస్సుల సౌకర్యం వుంది. మరియు నెల్లూరు నుండి ప్రైవెట్ ఆటోల సౌకర్యం కూడా వుంది.
రైలు మార్గం : కసుమూరుకు సమీపంలోని రైల్వే స్టేషన్లు వచ్చేసి వెంకటాచలం – 9 km, మనుబోలు – 14 km, వేదాయపాలెం – 15 km, నెల్లూరు – 25 km. ఈ రైల్వే స్టేషన్ల నుండి కసుమూరుకు ఆటోలు అందుబాటులో వుంటాయి.
విమానాశ్రయాలు : కసుమూరుకు సమీపంలోని విమానాశ్రయాలు తిరుపతి – 95 km, చెన్నై – 173 km. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు