kadapa
కడప నగరంలో చూడవలసిన ప్రదేశాలు
కడప నగరం
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలో వున్న రాయలసీమ ప్రాంతంలోని ఒక ప్రముఖ నగరం.
ఈ కడప నగరం తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ఇక్కడి అమీన్ పీర్
దర్గాను దక్షిణ ఆజ్మీరుగా పిలుస్తున్నారు. ఇప్పుడు మనం ఈ నగరంలో చూడవలసిన
ప్రదేశాలను గురించి తెలుసుకుందాం.
కడప నగరంలో చూడవలసిన ప్రదేశాలు :
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం
- అమీన్ పీర్ దర్గా
- పాలకొండలు
- నగరవనం పార్కు
- శ్రీ పాలకొండ్రాయ స్వామి ఆలయం
- పాలకొండలు జలపాతం
- శిల్పారామం
దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానం :
దేవుని కడపలోని “శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయం” కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కడప నగరంలో వున్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయం “తిరుమలకు తొలి గడపగా” ప్రసిద్ధి గాంచింది. దక్షిణ భారతదేశ యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి మరియు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంకు కాలిబాటన వెళ్ళే వారికి కడప నగరమే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడు క్షేత్రాలకు వెళ్ళే భక్తులు ఖచ్చితంగా మొదటగా శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం ఈ మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. తిరుమలకు వెళ్ళే భక్తులు మొదటగా ఇక్కడకు వచ్చి ఇక్కడి స్వామి వారిని దర్శించుకొని అనంతరం తిరుమలకు వెళ్తారు, ఈ ఆనవాయితీ వల్లనే కడపకు “తిరుమలేశుని తొలి గడప” అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి వున్న మరోక విశిష్టత మత సామరస్యం. ఉగాది నాడు ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోడం కనిపిస్తుంది. వారితో పాటు కొంతమంది జైనులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం రథ సప్తమి నాడు జరిగే తేరు తిరునాల్ల ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కృపాచార్యులు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రంకాగా దేవుని కడప ఆలయం హనుమత్ క్షేత్రం, అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వారి వెనుకభాగాన నిలువెత్తు విగ్రహరూపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు నెలకొని ఉన్నారు. ఈ ఆలయంలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు వున్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పారు. ఈ ఆలయంలో నాగుల విగ్రహాలు, శమీ వృక్షం, ఆళ్యార్ల సన్నిధి, కళ్యాణ మండపం, విశ్వక్సేన మందిరం మొదలైనవి చూడదగినవి. ఇక్కడ కంచి తరహాలో ఆలయ మండపం పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ పాడ్యమి నుంచి ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఏడో రోజు మాఘశుద్ధ సప్తమి (రథ సప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామిని గ్రామంలో ఊరేగిస్తారు. ఈ ఆలయం ప్రస్తుతం TTD ఆధీనంలో వుంది. ఆలయ నిర్వహణ అంతా TTD బోర్డ్ పరిధిలోనే జరుగుతుంది. శ్రీ కృష్ణ దేవరాయలతో సహా పలువురు విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు దేవుని కడప ఆలయాన్ని సందర్శించి మడి మాన్యాలు, ఆభరణాలు విలువైన కానుకలు సమర్పించారు. దేవుని కడప ఆలయానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలను ఆలయ ప్రాంగణం లోని శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు.అమీన్ పీర్ దర్గా ( పెద్ద దర్గా ) :
కడప పట్టణంలోని నకాష్ వీధి సమీపంలో పెద్ద దర్గా (లేదా) అమీన్ పీర్ దర్గా వుంది. ఈ దర్గా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా కావడం వల్ల దీనిని “దక్షిణ భారతదేశపు అజ్మీర్” అని పిలుస్తారు. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ “హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి నాయబ్ ఎ రసూల్”. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుండి 1683లో కడప నగరానికి చేరుకున్నారు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యారు. ఈయన సూఫీతత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందారు. ఈయన శిష్యుడు “నేక్ నామ్ ఖాన్” ఈయన కడపను పాలించారు. నేక్ నామ్ ఖాన్ తన గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా. అమీన్ పీర్ దర్గాలో పెద్దా, చిన్న కలిపి మొత్తం 18 దర్గాలు వున్నాయి. ప్రతి నెల ఇక్కడ గంధం, ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటారు. ఈ పీఠానికి దేశమంతటా 27 లక్షల మంది శిష్యులు వున్నట్లు ఇక్కడి ప్రతినిధులు చెపుతున్నారు. మన దేశం నుండే గాక గల్ఫ్ దేశాల నుండి కూడా భక్తులు ఈ దర్గాను సందర్శించుకుంటున్నారు. ఇక్కడ దర్గా ఉరుసు మహోత్సవాలు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతాయి. ఈ ఉరుసు ఉత్సవం ప్రతి సంవత్సరం ఉర్దూ మాసం అయిన మదార్ నెలలో నిర్వహిస్తారు. ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు, సినీ ప్రముఖులు వస్తుంటారు. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుది. అయితే ఎక్కువగా గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు ఈ దర్గాని సందర్శింటానికి వస్తుంటారు. ఈ దర్గాను సందర్శించడానికి సెలెబ్రెటీలు సైతం క్యూ లో వుంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు, “ఆస్కార్” విజేత అయిన “A R రెహ్మాన్” ఇక్కడ దర్శించే ప్రముఖులలో మొదటి వారు.పాలకొండలు :
కడప నగరానికి సమీపంలో వున్న ఈ పాలకొండలు, కడప నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణని కలిగిస్తున్నాయి. ఈ పాలకొండలలో పాలకొండరాయ స్వామి ఆలయం, అద్బుతమైన జలపాతాలు, నగరవనం పార్కు, శిల్పారామం వున్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.- నగరవనం పార్కు
- శ్రీ పాలకొండ్రాయ స్వామి ఆలయం
- పాలకొండలు జలపాతం
- శిల్పారామం
నగరవనం పార్కు :
కడప నగరంలోని పాలకొండలలో చూడవలసిన ప్రదేశాలలో “నగరవనం పార్కు” కూడా ఒకటి. చుట్టూ కొండలు వుండి పచ్చని చెట్లతో నిర్మించబడిన ఈ పార్కు ప్రకృతి ప్రేమికులను ఆనందింపజేస్తుంది. పార్కులోకి ప్రవేశించిన వెంటనే మనకు ఒక విగ్రహం నమస్కారము చేస్తూ స్వాగతం పలుకుతుంది. ఈ విగ్రహం ఈ పార్కుకు ఒక ఆకర్షణగా నిలిచింది. చుట్టూ ఎత్తైన కొండలు లోపల రకరకాల పూల చెట్లతో నిర్మించిన ఈ నగరవనం పార్కు పర్యాటకులను భలే ఆకర్షిస్తుంది. ఈ పార్కులో మనం రకరకాల చెట్లను చూడవచ్చు, రోజ్ గార్డెన్, వేప వనం, దేవదారు వనం, కలువ వనం, రాశి వనం, నక్షత్ర వనం మొదలయినవి. ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా అందుబాటులో వుంది, అంతే కాకుండా సైకిల్ రైడింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎంచక్కా మీరు సైకిల్లో ఈ నగరవనం పార్కు మొత్తం చుట్టిరావచ్చు. చిన్న పిల్లల కోసం చాలా రకాల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారు అనగా ఊయలలు, జారుడుబండ లాంటివి. ఆదివారం నాడు ఎక్కువగా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మీరు ఈ పార్కు సమీపంలో పాలకొండలు జలపాతంను మరియు శ్రీ పాలకొండ్రాయ స్వామి ఆలయంను కూడా సందర్శించవచ్చు.శ్రీ పాలకొండ్రాయ స్వామి ఆలయం :
నగరవనం పార్కు సమీపంలోని ఒక కొండ మీద “శ్రీ పాలకొండ్రాయ స్వామి ఆలయం” వుంది. కొండ మీదకు వెళ్లడానికి మెట్లు నిర్మించారు దాదాపు 500m వరకు ఈ మార్గం వుంటుంది, ఈ మార్గం కొంచెం కష్టతరంగా ఉంటుంది మీరు మీతో పాటు వాటర్ బాటిల్ ను తప్పకుండా తీసుకెళ్లండి. చుట్టూ ఎత్తైన కొండల మధ్య నిర్మించిన ఈ ఆలయం చాలా అద్భుతంగా వుంటుంది. ఆలయం లోపల శ్రీ పాలకొండ్రాయ స్వామి (శ్రీ మహా విష్ణువు) నెలకొని వున్నారు. ఈ ఆలయం లోపల ఒక పెద్ద పుట్ట కూడా వుంది. ఆలయం వెనుక భాగంలో ఒక చిన్న పిల్ల కాలువ ప్రవహిస్తూ ఉంటుంది అది అలానే ప్రవహిస్తూ కింద ఒక పెద్ద జలపాతంను ఏర్పరుస్తుంది. ఈ పాలకొండ్రాయ స్వామి ఆలయంను దర్శించడానికి చాలా మంది భక్తులు ప్రతి శనివారము మరియు ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ సమీపంలో ప్రతి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయంను దర్శించాక సమీపంలోనే కొండ కింది భాగంలో కుడి వైపున ఒక జలపాతానికి మార్గం వుంటుంది ఆ జలపాతాన్ని కూడా దర్శించండి.పాలకొండలు జలపాతం :
వర్షాకాలం వస్తే చాలు కడప నగరంలోని పాలకొండలలో ఒక అద్భుతమైన జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలపాతాన్ని సందర్శించడానికి చాలా మంది ఆదివారం నాడు ఇక్కడకు వస్తుంటారు. లోపల జలపాతం కింద కొద్దిగా ఖాళీ ప్రదేశం వుంటుంది దానిలో జలపాతం నీరు పడుతూ ఉంటుంది అందువలన అక్కడ పిల్లలు లేదా పెద్దలు ఆడుకోవడానికి బాగుంటుంది. జలపాతం పైన ఒక లోయలాగా వుంటుందట అది మొత్తం నీటితో మునిగి పోయి వుంటుంది, అది చాలా ప్రమాదకరం అని అక్కడి వారు చెప్పారు, కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు.శిల్పారామం :
ఈ శిల్పారామంను 2009లో కడప రిమ్స్ హాస్పిటల్ సమీపంలో నిర్మించారు. శిల్పారామం సాంప్రదాయ మరియు సాంసృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని కలిగివుంటుంది. భారతీయ కళలు, చేతివృత్తులను ప్రోత్సహించడం మరియు సంరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికను ఏర్పాటు చేసింది. జలపాతాలు, ఉద్యానవనాలు మరియు సహజ సిద్దమైన కొండల మధ్య ఈ శిల్పారామం నిర్మించబడింది. గ్రామీణ చేతివృతులవారు తయారు చేసే ఉత్పత్తులను ఈ శిల్పారామంలో ప్రదర్శించి విక్రయిస్తారు. ఈ శిల్పారామంలో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో వుంది, ఇక్కడి బోటింగ్ మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది మరియు వివాహాలు, సాంప్రదాయ వేడుకల కోసం ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ నిర్మించారు. అంతే కాకుండా సాంప్రదాయ కళల ప్రదర్శన కోసం సాంప్రదాయ కళావేదికను ఇందులో ఏర్పాటు చేశారు అక్కడ ప్రతి శని, ఆదివారాలు మరియు కొన్ని ముఖ్యమైన రోజులలో నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ శిల్పారామంలో పిల్లల వినోదం కోసం చాలా సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం కూడా కలదు అక్కడ కూల్ డ్రింక్స్, చిప్స్ లాంటివి లభిస్తాయి. ఈ శిల్పారామంలో ఇనుముతో తయారు చేసిన కొన్ని ఆకారాలు (జంతువులు, పక్షులు) పర్యాటకులను చాలా ఆకర్షిస్తాయి. శిల్పారామం లోపలికి వెళ్ళే ముందర ప్రవేశ ద్వారం వద్ద రెండు ఏనుగులు ద్వారానికి ఇరువైపులా ఇక్కడకు వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి.ఎలా వెళ్ళాలి ?
ఇక్కడి ప్రదేశాలను అన్నింటికి చేరుకోవడానికి ఆటోలు అందుబాటులో ఉన్నాయి, మీకు కడప బస్టాండ్ వద్ద నుండి ఇవి అందుబాటులో వుంటాయి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు